మరో మూడు వారాలు పాటు లాక్‌డౌన్‌ పొడిగించిన జర్మనీ

బెర్లిన్‌: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ను జర్మనీ మరో మూడు వారాలు పాటు పొడిగించింది. ఈ నెల 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో నిబంధనలను సడలించింది. కరోనా వ్యాప్తి తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలను తెరవవచ్చునని పేర్కొంది. జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌, 16 రాష్ట్రాల గవర్నరు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘ చర్చ నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ జీవితం తిరిగి పొందుతున్న సమయంలో కేసుల పెరుగుదలతో పాటు సరికొత్త వేరియంట్లు పుట్టుకురావడంపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో సమన్వయం చేసుకునే లక్ష్యంతో సడలింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తొలి దశలో పాఠశాలలను తెరిచారు. దీంతో గత వారం విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. రెండున్నర నెలల తర్వాత సోమవారం బార్బర్‌ షాపులకు అనుమతినిచ్చారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నియమాలు ఆదివారం వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఆదివారం తర్వాత నుండి కొన్ని సడలింపులిస్తూ నిర్ణయాలు చేశారు. దుకాణాలతో పాటు మ్యూజియంలు తెరిచేందుకు ఈసారి అవకాశం కల్పించారు.