‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. ఓటింగ్‌ ఎప్పుడంటే ?

గత కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపుతున్న ‘మా’ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 10 వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జూబ్లీ హిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ… ఎన్నికల అధికారి వి.కఅష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నగారా మోగడంతో… తెలుగు చిత్రప్రముఖులతోపాటు ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలతోపాటు, పాటించవలిసిన ఎన్నికల నియమ నిబంధనలను కూడా వి.కృష్ణమోహన్‌ వెల్లడించారు.

అక్టోబర్‌ 10 న ఎన్నికలు.. అదేరోజు ఫలితాలు..
ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ఈ నెల 27 నుండి 29 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 30 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. వచ్చే నెల రెండో తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్‌ 10 న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి.

ఒక అభ్యర్థి ఒక పదవి కోసమే పోటీచేయాలి..
ఒక అభ్యర్ధి ఒక పదవి కోసమే పోటీ చేయాలనీ, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరై ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదనీ, 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకుండా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదనీ ఎన్నికల నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్యనే పోటీ..
ఈసారి అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సి.వి.ఎల్‌.నరసింహారావు పోటీ పడుతున్నప్పటికీ పోటీ ప్రధానంగా ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ‘మా’ ఎన్నికలెప్పుడు అనే చర్చ ఉత్కంఠంగా కొనసాగుతుండగా… ఎన్నికల నగారా మోగింది.. ఎట్టకేలకు ఆ తేదీ ఖరారయ్యింది.. పోటీదారుల్లో ఎందరు నెగ్గుతారో… వేచిచూడాలిమరి..!