‘మీట్ క్యూట్’.. నాని బ్యానర్లో కొత్త చిత్రం

చిత్ర నిర్మాణ రంగంలోనూ ప్రవేశించిన హీరో నాని తన అభిరుచికి అద్దం పట్టేలా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన నాని తాజాగా మరో ప్రాజెక్టుతో ముందుకొచ్చారు. ఈ చిత్రానికి ‘మీట్ క్యూట్’ అనే టైటిల్ ను ప్రకటించారు. హైదరాబాదులో నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కు నాని క్లాప్ కొట్టారు.

ఈ సినిమాకు దీప్తి గంటా దర్శకురాలు కాగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర తారాగణం వివరాలు వెల్లడిస్తారు. ముహూర్తం షాట్ లో మాత్రం ప్రముఖ నటుడు సత్యరాజ్ కనిపించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. ఇవాళ ఓ కొత్త ప్రస్థానం ప్రారంభమైందని, ఇది ఎంతో ప్రత్యేకమైనదని, అందుకు ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉన్నాయని నాని ట్వీట్ చేశారు.