అభిమానిని ఆదుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాని విషయంలో చూపిన దాతృత్వం ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులనూ మనసుకు హత్తుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే విశాఖపట్నానికి చెందిన మెగాస్టార్‌ వీరాభిమాని వెంకట్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ”నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను” అని ట్విటర్‌ వేదికగా చిరంజీవిని వెంకట్‌ అభ్యర్థించారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్‌ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. కానీ వెంకట్‌ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చిరంజీవి వెంకట్‌ను కలవాలని భావించి వెంకట్‌, వెంకట్‌ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్‌ టికెట్స్‌ తీయించి హైదరాబాద్‌ రప్పించారు. వెంకట్‌, ఆయన భార్య సుజాతను చిరంజీవి తన నివాసంలో కలిసి వెంకట్‌ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్‌ మెడికల్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వెంకట్‌ అన సొంత ప్రాంతంలోని ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులను కోరారు. దీనికి స్పందించిన మెగాస్టార్‌ విశాఖ ఆస్పత్రిలో బాధితునికయ్యే ఖర్చులన్నీ తానే స్వయంగా చూసుకుంటానని, అవసరమైతే చెన్నై హాస్పిటల్‌ కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెంకట్‌ భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. మెగాస్టార్‌ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.