వచ్చే వారం అమెరికా పర్యటనకు మోదీ.. 23న బైడెన్‌తో సమావేశం

భారత ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 23న ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక మోదీతో పలుమార్లు వర్చువల్‌గా మాట్లాడారు కానీ, ప్రత్యక్షంగా కలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి కానుంది.

ఆ సమావేశం తర్వాతి రోజు వాషింగ్టన్‌లో జరగనున్న ‘క్వాడ్’ సమావేశంలో భారత ప్రధాని పాల్గొంటారు. క్వాడ్ దేశాలైన ఆతిథ్య అమెరికా, భారత్ సహా సహా ఆస్ట్రేలియా, జపాన్ దేశాధి నేతలు కూడా పాల్గొంటారు. ఇందులో టీకా కార్యక్రమం, సైబర్ భద్రత, సముద్ర జలాలు, విపత్తుల సమయంలో సహకారం, వాతావరణ మార్పులు, విద్య, అనుసంధాన, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉద్రిక్త పరిస్థితులపైనా సమీక్షించనున్నారు.

మరోపక్క, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు. మోదీ చివరిసారి బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇదే తొలి పర్యటన. కాగా, వాషింగ్టన్ పర్యటన అనంతరం మోదీ ఐరాస 76వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు.