ఆక్సిజన్‌ సరఫరాపై మోదీ సమీక్ష

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్‌ సరఫరా, ఉత్పత్తి తదిరత అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు. ఆక్సిజన్‌ అక్రమ నిల్వలపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని మోదీ ఈ సందర్భంగా సూచించారు. వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రయివేటు, ప్రభుత్వ స్టీల్‌ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారుల సహకారంతో గత కొద్ది రోజులుగా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత రోజుకు దాదాపు 3,300 మెట్రిక్ టన్నుల మేర పెరిగినట్లు పీఎంవో ప్రకటనలో పేర్కొంది. 20 రాష్ట్రాలకు డిమాండ్‌కు మించి సరఫరా చేసినట్లు తెలిపింది. సుదీర్ఘ దూరం పంపే ట్యాంకర్ల కోసం రైల్వేను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.