‘క్రేజీ అంకుల్స్‌’ తో వస్తున్న శ్రీ ముఖి

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ క్రేజీ అంకుల్స్‌’ ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో  శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఇ. సత్తిబాబు మాట్లాడుతూ సమాజంలో, జీవితంలో మహిళలకు ఎంత ప్రాముఖ్యం ఉందనేది చెప్పే చిత్రమిది. శ్రీముఖిది చాలా ముఖ్యమైన పాత్ర. ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ అనుకున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే… రెడ్డిగారు, రాజాగారు, రావుగారు అన్నమాట! చివరకు, ‘క్రేజీ అంకుల్స్‌’ టైటిల్‌ ఖరారు చేశాం” అని అన్నారు.

గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలలో ఒకరైన శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ అధినేత శ్రీవాస్‌ మాట్లాడుతూ ”లాక్‌డౌన్‌లో నేను, రచయిత ‘డార్లింగ్‌’ స్వామి ఫోనులో మాట్లాడుకున్నప్పుడు ఆయన ‘క్రేజీ అంకుల్స్‌’ కాన్సెప్ట్‌ చెప్పారు. దాన్ని డెవలప్‌ చేశాం. ముందు గంట నిడివి గల సినిమాగా తీయాలనుకుని ప్రారంభించాం. తర్వాత మంచి సన్నివేశాలు, పాత్రలు పడటంతో నిడివి పెరిగింది.

మనో మాట్లాడుతూ ‘హాస్యప్రధానంగా నా పాత్ర సాగుతుంది. ఇంటిల్లిపాదిని అలరించే వినోదభరిత చిత్రమిది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది’ అని తెలిపారు. శ్రీముఖి మాట్లాడుతూ ‘నటనకు ఆస్కారమున్న చక్కటి పాత్రను పోషించాను. నా క్యారెక్టర్‌ అందరినీ మెప్పిస్తుంది’ అని చెప్పింది. ఇందులో తాను యోగా టీచర్‌గా కనిపిస్తానని పోసాని కృష్ణమురళి అన్నారు. వినోదమే పరమావధిగా తాము రూపొందిస్తున్న చిత్రమిదని, పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో ఈ గీతాన్ని తెరకెక్కిస్తామని, శ్రీముఖి, రాజారవీంద్ర, మనో పాత్రలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయని నిర్మాత శ్రీవాస్‌ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.