NEET నేడే… నిబంధనలు మరవొద్దు

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఈ రోజు జరగనుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహణ కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 15,97,433 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. 3,842 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2,28,914 మంది పరీక్షకు హాజరు కానుండగా.. మిజోరాం నుంచి అత్యల్పంగా 1,741 మంది పరీక్ష రాయనున్నారు. కరోనా విజృంభిస్తున్నందున ఒక్కో కేంద్రంలో పన్నెండు మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ఇక, గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు.. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి నీట్‌కు 55,800 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరి కోసం 112 కేంద్రాలు సిద్ధం చేశారు. ఏపీలో 151 పరీక్ష కేంద్రాల్లో 61,892 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్రలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క విజయవాడ కేంద్రంలోనే 40 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఎగ్జామ్స్‌ రాసే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించింది. ఆరోగ్యంపై సెల్ప్‌ డిక్లరేషన్‌ ఫాం, ఆధార్‌, పాన్‌ లాంటి ఐడెంటిటీ కార్డును కూడా తప్పనిసరిగా తీసుకురావాలని. ఇక అప్లికేషన్‌ ఫామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటో, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి అని తెలిపింది. 50ML హ్యాండ్‌ శానిటైజర్‌, ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌, మాస్క్‌, గ్లోవ్స్‌ తీసుకెళ్లాలి. ఇక హ్యాండ్‌ బ్యాగ్స్‌, జ్యువెలరీ, హ్యాట్‌, స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వస్తువులేవీ తీసుకెళ్లకూడదు. ఇక గంటన్నర ముందే ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.

NTA డ్రెస్‌కోడ్‌లో కూడా స్వల్ప మార్పులు చేసింది. విద్యార్థులు తక్కువ హీల్‌ ఉండే స్లిప్పర్స్‌, శాండిల్స్‌ వేసుకోవచ్చు. పాదాలు కప్పేసేలా ఉండే ఫుట్‌వేర్‌, షూస్‌ లాంటివి వేసుకోకూడదు. సంప్రదాయ దుస్తులు..అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. లైట్‌ హాఫ్‌ స్లీవ్స్‌ డ్రస్సెస్‌ ధరించి రావాలి. లాంగ్‌ స్లీవ్స్‌,పెద్ద పెద్ద బటన్స్‌ ఉండే డ్రస్సులు వేసుకోకూడదు.

మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు. పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి.

ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని NTA సూచించింది.