తమిళనాడు సీఎం పదవికి రాజీనామా చేసిన పళనిస్వామి!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు.

ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “మరింత మెరుగైన తమిళనాడు కోసం మీ సలహాలు, సూచనలు, సహకారం నాకు అవసరం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. పాలనలో విపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో నాకు తెలుసు” అని అన్నారు.

ఇక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించి, పాలనా పగ్గాలను అందించేందుకు గవర్నర్ కార్యాలయం అధికారులు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే 125 సీట్లల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించగా, అన్నాడీఎంకే 65 సీట్లతో సరిపెట్టుకుందన్న సంగతి తెలిసిందే.