పవన్ ఒక మంచి పుస్తకం: రానా

పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మలయాళంలో వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు చకచకా జరుగుతోంది.

పవన్ కల్యాణ్ – రానా కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తొలిసారిగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి రానా ప్రస్తావించాడు. “పవన్ కల్యాణ్ గారి కాంబినేషన్లో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నటనలో ఆయనకి గల అనుభవం తెలిసిపోతూనే ఉంటుంది.

పవన్ కల్యాణ్ గారిని చూడగానే ఆయన వ్యక్తిత్వానికి .. అనుభవానికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. షూటింగు గ్యాపులో ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఎన్నో విషయాలపై  ఆయనకి మంచి అవగాహన ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఓ మంచి పుస్తకం వంటివారు. ఆయన నుంచి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.