పవన్ 28వ సినిమాకి రంగం సిద్ధం!

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత తన దూకుడు పెంచేశారు. వరుసగా భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం ఒక వైపున ‘భీమ్లా నాయక్’ .. మరో వైపున ‘హరి హర వీరమల్లు’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమాకి సంబంధించి, తన పోర్షన్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారని అంటున్నారు.

ఇక ఆ తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేయనున్నారు. ఇది చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం. ఆ తరువాత ఆయన హరీశ్ శంకర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను దర్శక నిర్మాతలు పూర్తి చేశారు. తాజాగా పవన్ ను కలుసుకుని ఆ విషయం చెప్పారు కూడా.

త్వరలోనే పవన్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 28వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ సంగీతాన్ని అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ఆయాంక బోస్ .. కళాదర్శకుడిగా ఆనంద్ సాయిని ఎంపిక చేసుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ తరువాత సెట్ అవుతున్న ఈ కాంబినేషన్ పట్ల అంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు.