గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాష్ రాజ్…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు షాద్ నగర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి మొక్కలు నాటారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తనికెళ్ల భరణి ఎప్పుడు కూడా చాలా మంచి చాలెంజ్ లు తీసుకొని నాకు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా నాకు ఇష్టమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, నాకు బాసు కెసిఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఈ అయిదు, ఆరు సంవత్సరాలలో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయడం జరిగిందని… దానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి 10 సంవత్సరాల విజన్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ మట్టి మనుషులు.. మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉందన్నారు. కాబట్టి ఆ మట్టి పరిమళం విలువ వారికి తెలుసు… వారు మట్టితో మాట్లాడుతారు కాబట్టి మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు పెంచే బాధ్యత మనందరిదీ ప్రభుత్వం చేస్తుంది కదా అని కాకుండా మనం కూడా బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని అందులో భాగంగా నా మిత్రుడు మహా నటుడు మోహన్ లాల్, తమిళ్ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.