ప్రధాని మోదీ విలువైన క్షణాలు

ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ  ప్రకృతిని, పర్యావరణాన్నీ మరియు జీవరాశులను ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ఆయన మూగజీవాల పట్ల తనకున్న సాధుగుణాన్ని మరోసారి చాటుకున్నారు. తన ఇంటి ఆవరణలో సంచరిస్తున్న జాతీయ పక్షి నెమలిని మచ్చిక చేసుకుని దానికి ఆహారం తినిపిస్తున్న వీడియో ప్రధాని మోదీ ఆదివారం ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీ విలువైన క్షణాలు అనే క్యాప్షన్‌తోపాటు హిందీలో రాసిన పద్యాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ప్రధాని రోజువారీ దినచర్యలో భాగంగా ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు, కార్యాలయానికి వెళుతున్న సందర్భాలలో ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు మయూరం పురివిప్పి ఆడుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రధాని మోదీ తన నివాసంలో ఫైళ్లు చూస్తుండగా నెమళ్లు ఆయనకు దగ్గరగా సంచరింస్తున్నాయి. ఆయన వాటికి ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు ప్రకృతితో ప్రధానికి ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నివాస ప్రాంగ‌ణంలో ప్ర‌ధాని ప‌లు ప‌క్షుల‌కు గూళ్లను సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లందరూ తెగ సంబరపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై వైరల్ అవుతోంది.