2022 చివరినాటికి 5 బిలియన్‌ డోసులు ఉత్పత్తి టార్గెట్.. జి-20 సదస్సులో మోడీ

కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ హామీనిచ్చారు. జి 20 దేశాల సదస్సులో పాల్గన్న ఆయన మాట్లాడుతూ… కరోనాపై పోరాటంలో సహకారం విషయంలో ‘ఒకటే ప్రపంచం, ఒకటే ఆరోగ్యం’గా ఉండాలని సూచించారు. ‘గ్లోబల్‌ ఎకనమీ అండ్‌ గ్లోబల్‌ హెల్త్‌’ సెషన్‌లో అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడం, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌పై పరస్పర విధానాలు వంటి సమస్యలను లేవనెత్తారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా చెప్పారు. గ్లోబల్‌ ఫైనాన్స్‌ ఆర్కిటెక్చర్‌ను మరింత స్వేచ్ఛగా, న్యాయంగా తీసుకువచ్చేందుకు కనీస కార్పొరేట్‌ పన్నుకు 15 చొప్పున తీసుకు రావాలని జి 20 నిర్ణయాన్ని మోడీ స్వాగతించారు. కంపెనీలు ఉన్న దేశాల్లో కొంత మొత్తంలో పన్ను చెల్లించేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ష్రింగ్లా చెప్పారు. పన్నుల ఎగవేతను కొంత మేర అరికట్టేందుకు 2014లోనే కనీస కార్పొరేట్‌ పన్నుల అంశాన్ని ప్రధాని మోడీ తొలిసారిగా ప్రతిపాదించారని పేర్కొనడం గమనార్హం.