‘తాండవ్’పై నిరసన సెగ.. సైఫ్ అలీఖాన్ క్షమాపణ చెప్పాలి..

తన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్ హిందువుల సెంటిమెంట్లను గాయపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఈ సిరీస్ లో శివుడిని ఫన్నీగా చూపారని ఆయన ఆరోపించారు. ఈ భాగాన్ని డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ తొలగించాలని కోరిన రామ్ కదమ్.. నటుడు జేషన్ ఆయూబ్ కూడా అపాలజీ చెప్పాలన్నారు. ఇందులో తగిన మార్పులు చేయకపోతే ఈ సిరీస్ ను బహిష్కరిస్తామన్నారు. ముంబై పోలీసులకు తాను ఫిర్యాదు కూడా చేస్తానని ఆయన చెప్పారు.

హిందూ దేవతలు, దేవుళ్లను బాలీవుడ్ ఎందుకు కించపరుస్తోందని, చాలా కాలంగా ఇలా జరుగుతోందని రామ్ కదమ్ ఆరోపించారు. తాండవ్ సిరీస్ లో సైఫ్ అలీఖాన్ తో బాటు డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్ తదితరులు నటించారు.