అహ్మద్ పటేల్ మృతికి రాహుల్ , ప్రియాంకా, సోనియా గాంధీల సంతాపం

సోనియా గాంధీ

రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్ ​మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ”అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ”ఆయనను గొప్ప ప్రజ్ఞాశాలిగా కీర్తించిన ఆమె క్లిష్ట సమయాల్లో సలహాల కోసం ఎన్నోసార్లు ఆయనను సంప్రదించానని గుర్తుచేసుకున్నారు.

రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపట్ల ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చాలా విలువైన ఆస్తిని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం చివరి శ్వాస వరకూ అహ్మద్ పటేల్ కృషి చేశారని.. అహ్మద్‌ పటేల్‌ నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడని.. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మూలస్తంభం లాంటివారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీయే తన శ్వాసగా జీవితాంతం పనిచేశారని, ఎన్నో కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ఆయన సేవలను ఏ మాత్రం విస్మరించలేమని ఫైజల్, ముంతాజ్ కుటుంబానికి `          ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రియాంకాగాంధీ

అహ్మద్ పటేల్ మరణ వార్త తెలిసిన వెంటనే తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని ప్రియాంకాగాంధీ వాద్రా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడైన నేతల్లో ఆయన ఒకరని, సీనియర్ రాజకీయ వేత్త అయినప్పటికీ.. ఓ స్నేహితుడిలా మెలిగేవాడని చెప్పారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో సలహాలు, సూచనలు గొప్పగా పనిచేశాయని, ఆయన మరణం పార్టీకి తీరనిలోటు అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఏఐసీసీలో ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని చెప్పారు.