కేరళలో వరుణ బీభత్సం.. 11కు చేరిన మృతుల సంఖ్య

కేరళలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆవాసాలు నీట మునిగాయి. దాంతో వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది.

వర్షాల కారణంగా కొట్టాయం జిల్లా కూట్టికల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పలువురు ఆ కొండచరియల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే తొమ్మది మృతదేహాలను వెలికితీసిన రక్షణ సిబ్బందికి తాజాగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా కూడా ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ సిబ్బంది, భారత వాయుసేన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నాయి.