రజనీ మద్దతు కోరుతా: కమల్

కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ప్రస్తుతం గొప్ప ఆదరణ లేదని లోక్‌సభ ఎన్నికల్లో తేలినప్పటికీ.. కమల్ హాసన్ మాత్రం.. డోంట్ గివ్ అప్ అనుకుంటున్నారు. తన పార్టీ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అయితే.. తన బలంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే కూటమి కట్టాలనే ఆలోచనకు వచ్చారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నానని ప్రకటించారు. రజినీకాంత్ పార్టీ పెట్టినా, పెట్టకపోయినా మద్దతు కోరుతానని.. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. రజనీకాంత్‌ తన రాజకీయ వైఖరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అంతకంటే ముందు ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. డీఎంకేతో కూటమిలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపైా స్పందించారు. ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చేశారు. నవంబర్‌లో తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని .. ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని అంటున్నారు. కమల్ భావజాలంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.