రంగా ఆశయాలు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతాయి: నేరేళ్ళ సురేష్

గుంటూరు: బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, బీసీ లకు, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం దక్కాలని తన జీవిత పర్యంతం పోరాడిన స్వర్గీయ వంగవీటి మొహనరంగా ఆశయాలు సాధ్యం చేసే శక్తి ఒక్క జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. సోమవారం వంగవీటి రంగా 34వ వర్ధంతి సందర్భంగా నగరంలోని కొత్తపేట, నెహ్రు నగర్, పాతగుంటూరు, నగరంపాలెం, నల్ల చెరువు, అడపా బజార్, శ్రీనివాసరావుతోటలోని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. తొలుత పార్టీ కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. రంగా తన జీవితాన్ని పేద ప్రజల అభ్యున్నతికే అంకితం చేశారని కొనియాడారు. ఎవరికి ఆపద అన్నా, కష్టం వచ్చినా వారికి ఆశ్రయమిచ్చి కొండంత అండగా రంగా నిలిచేవారన్నారు. రంగాకి వెల్లువెత్తుతున్న ప్రజాభిమానాన్ని, పెరుగుతున్న విశేష ఆదరణని ఓర్చుకోలేని కొందరు ఆయన్ని వేటకొడవళ్ళతో నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ప్రజల గుండెల్లో జ్వలిస్తూనే ఉందన్నారు. రంగాని భౌతికంగా లేకుండా చేశారు కానీ ఆయన ఉన్నతమైన ఆశయాలను మాత్రం ఏమి చేయలేకపోయారని సురేష్ అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ రంగాని ఒక కులానికే పరిమితం చేయటం వెనుక రాజకీయ కుట్ర దాగుందని ఆయన విశ్వనరుడని అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం ఎంత శక్తివంతమైనవో రంగా ఆశయాలు కూడా అంతే శక్తి వంతమైనవన్నారు. రంగాని కేవలం రాజకీయ ముడి సరుకుగా చూసే వారికి త్వరలోనే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మార్కండేయ బాబు అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు యడ్ల నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, కటకంశెట్టి విజయలక్ష్మి, ఆనంద్ సాగర్, నాయకులు బండారు రవీంద్ర, సోమి ఉదయ్, త్రిపుర, గిడుతూరి సత్యం, పుల్లంసెట్టి ఉదయ్, జడ సురేష్, కోలా అంజి, యాట్ల దుర్గాప్రసాద్, సయ్యద్ షర్ఫుద్దీన్, రాజనాల నాగలక్ష్మి, ఆషా, హరి సుందరి, మిద్దె నాగరాజు, నాగేంద్ర సింగ్, రజాక్, పులిగడ్డ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.