ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల పునరుద్ధరణ

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. గల్లంతైన వారితో పాటు తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దింపారు. ప్రత్యేక జాగిలాల బృందం ‘కెనైన్‌ స్క్వాడ్‌’ను కూడా తెప్పించారు. నిన్న 16 మంది కార్మికులను ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించిన విషయం తెలిసిందే. మరో 14 మంది మృతదేహాలను గుర్తించారు. మరికొంత మందిని రక్షించేందుకు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సొరంగాల్లో భారీ స్థాయిలో మట్టి పూడుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

250 మీటర్ల పొడవు ఉన్న ఆ సొరంగంలోకి జవాన్లు ఆదివారం అతి కష్టం మీద 150 మీటర్ల వరకు వెళ్లగలిగారు. అయితే ఎవరి ఆచూకీ వారికి లభించలేదు. మరోవైపు ధౌలీ గంగ నీటి మట్టం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగించింది. దీంతో రాత్రి రద్దు చేసిన సహాయక చర్యలు తిరిగి ఉదయం పునరుద్ధరించారు. మరో 30 మంది సొరంగాల్లో చిక్కుకున్నట్లు తమకు సమాచారం ఉందని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ పాడే తెలిపారు. వీరందరినీ కాపాడేందుకు దాదాపు 300 మంది ఐటీబీపీ జవాన్లు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఒక సొరంగంలో ఉన్నవారిని ఆదివారమే సురక్షితంగా కాపాడామని.. మరో టన్నెల్‌లో ఉన్నవారి కోసం వెతుకుతున్నామన్నారు. అయితే, స్థానిక యంత్రాంగం మరో 170 మంది గల్లంతైనట్లు తెలిపారన్నారు. తొలుత సొరంగంలో ఉన్నవారిని కాపాడడంపైనే దృష్టి సారించామన్నారు.

ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలప్రళయం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఎనిమిది మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది.