దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతం..!

వేసవిలో దాహం ఓ పట్టాన తీరదు. ఎన్ని తాగినా, ఏం చేసినా నోరు ఎండిపోతూనే ఉంటుంది. చల్లగా ఉన్నవి ఏవైనా మళ్లీ మళ్లీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటప్పుడు మన దాహం తీర్చేందుకు సరైనవి సబ్జా గింజలు. ఇవి దాదాపు అన్ని కిరాణా, సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. జస్ట్ ఓ చెంచాడు సబ్జా గింజల్ని ఓ గ్లాసు నీటిలో వేసి ఓ పావు గంట అలా ఉంచితే చాలు అవి చక్కగా ఉబ్బుతాయి. ఆ నీటిలో కాస్త పంచదార లేదా నిమ్మరసం వంటివి వేసుకొని తాగితే చాలు దాహం తీరడమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్నీ ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

సబ్జా గింజలతో ప్రయోజనాలు : ఇవి శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తాయి. జ్వరం వచ్చిన వారికి ఎంతో మేలు. అధిక బరువును తగ్గిస్తాయి. డైటింగ్ చేసేవాళ్లకు మేలు. గ్లాస్ సబ్జా షర్బత్ తాగితే, పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. రాత్రి పడుకునేటప్పుడు గ్లాసు సబ్జా గింజల డ్రింక్ తాగితే చాలు… తెల్లారాక శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కడుపులో మంట, ఉబ్బరం, ఆసీడిటీ, అజీర్తి లాంటి సమస్యలకు చెక్ పెడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పంచదార వేసుకోకుండా సబ్జా వాటర్ తాగితే సమస్య కంట్రోల్ అవుతుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ సెట్ అవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన సబ్జా గింజల్ని గ్లాసు పచ్చిపాలలో వేసుకొని కొన్ని చుక్కల వెనీలా కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. నోట్లో వికారంగా, వామ్టింగ్ వచ్చేలా ఉంటే సబ్జా గింజల జ్యూస్ తాగాలి. సబ్జాల వల్ల గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటివి తగ్గుతాయి. సబ్జా వాటర్‌లో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. సబ్జా గింజల పానీయం వల్ల మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ E వంటి పోషకాలు లభిస్తాయి. సబ్జా గింజల్ని ఇతర పండ్లు, షర్బత్‌లలో వేసుకొని తాగొచ్చు, తినొచ్చు.