వైజాగ్ లో ‘సర్కారువారి పాట’

కరోనా కారణంగా షూటింగులను ఆపుకున్న సినిమాలలో ‘సర్కారువారి పాట’ కూడా ఉంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగు ‘దుబాయ్’లో జరిగింది. అక్కడి నగరాల్లోను .. ఎడారి ప్రాంతంలోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత రెండవ షెడ్యూల్ షూటింగు జరుగుతుండగా, కరోనా వలన ఆపేయవలసి వచ్చింది. ఇక త్వరలో మళ్లీ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజా షెడ్యూల్ ను ‘వైజాగ్’లో ప్లాన్ చేశారట. మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారని అంటున్నారు.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. యాక్షన్ .. ఎమోషన్ కలిసిన వినోదభరితమైన కథ ఇది. పరశురామ్ మార్కు ఎంటర్టైనర్ అన్నమాట. బ్యాంకు స్కాముల చుట్టూ కథ తిరుగుతున్నప్పటికీ, కావలసినంత కామెడీ ఉంటుందని అంటున్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన హిట్ లేని కీర్తి సురేశ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ‘సంక్రాంతి’కి ఈ సినిమా థియేటర్లకు రానుంది.