`సోలో బ్రతుకే సో బెటర్` ట్రైలర్

‘మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని హక్కులను ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్‌ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నాం’ అంటున్నారు సాయితేజ్‌. సాయితేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. నభానటేష్‌ కథానాయిక. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సినిమాల్లో సిగరెట్‌కి, మందుకు దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇస్తారు కదా..అలాగే పెళ్లికి, పెళ్లానికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇవ్వాలి’ అంటూ రావు రమేష్‌..సాయితేజ్‌కు చెప్పే సంభాషణతో ట్రైలర్‌ సరదాగా సాగింది. ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి’ అంటూ ఆర్‌.నారాయణమూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంభాషణతో ట్రైలర్‌ను ముగించారు. ‘బ్రహ్మచారికి, ఓ అందాలభామకు మధ్య నడిచే ప్రణయగాథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. ఈ చిత్రం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.