రజినీకాంత్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు

కరోనా కేసుల ఉదృతి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాత్రి 9 దాటిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు జరపడానికి వీలు లేదు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే కర్ఫ్యూ నుండి రజినీకాంత్ సినిమా యూనిట్ సభ్యులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రజినీకాంత్ అన్నాత్తే చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేక అనుమతులు లభించాయి. దాంతో రాత్రి సమయంలో అన్నాత్తే షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నాత్తే సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. నైట్ షూట్ చేస్తున్న సమయంలో తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ను అమలు చేయడం జరిగింది. అయితే అన్నాత్తే షెడ్యూల్ డిస్ట్రబ్ కాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ షూటింగ్ ను ముగిస్తున్నారట. తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ తో అన్నాత్తే షూటింగ్ ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయితే అన్నాత్తే యూనిట్ మళ్లీ హైదరాబాద్ కు వచ్చే అవసరం ఉందడట. పలువురు స్టార్స్ డేట్లు తీసుకుని ఉండటంతో పాటు వారు హైదరాబాద్ కు వచ్చి ఉన్న కారణంగా అత్యవసర పరిస్థితుల్లో నైట్ షూట్ కు ప్రభుత్వం రజినీకాంత్ టీమ్ కు అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రజినీకాంత్ అన్నాత్తే సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. నయనతార.. కీర్తి సురేష్ తో పాటు పలువురు సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే షూటింగ్ ముగించాలనుకున్నా కూడా రజినీకాంత్ ఆరోగ్యం పాడవ్వడంతో షూటింగ్ ను వాయిదా వేశారు. ఇటీవలే మళ్లీ ప్రారంభించారు. ఇంతలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో షూటింగ్ కు అంతరాయం కలుగుతుందని అనుకున్నారు. కాని టీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో సాఫీగా అన్నాత్తే షూటింగ్ సాగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.