ట్రాఫిక్ లో సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఓటేసిన స్టార్ హీరో విజయ్!

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా ఓటు వేశారు. అయితే ఆయన తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్ కు రావడం విశేషం. ముఖానికి కరోనా మాస్కు ధరించిన విజయ్ స్పోర్ట్స్ సైకిల్ పై ట్రాఫిక్ లో ప్రయాణిస్తూ చెన్నైలోని నీలంకరై పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

అయితే, విజయ్ సైకిల్ పై రావడానికి కారణం పెరిగిన పెట్రో ధరలేనని, అందుకు నిరసనగానే సైకిల్ ఎంచుకున్నారని ప్రచారం జరిగింది. బీజేపీ కూటమికి ఓటేయవద్దని పరోక్షంగా చెప్పడానికే ఇలా చేశారని టాక్ వినిపించింది. అయితే విజయ్ అధికార ప్రతినిధి ఈ ప్రచారాన్ని ఖండించారు. తన నివాసం నుంచి పోలింగ్ బూత్ దగ్గరే కాబట్టి విజయ్ సైకిల్ పై వెళ్లారని వివరణ ఇచ్చారు.