అక్కినేని ఇంట పెళ్లి భాజా.. రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్‌..

అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్‌ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారట. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట. వెడ్డింగ్‌ కార్డులు కూడా పంచి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ పెళ్లి కార్డులను SP(సుమంత్‌-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్‌ చేస్తూ తీర్చిదిద్దారు. సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

కాగా, సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు.