8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్

వ్య వసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆందోళనకు దిగిన విపక్ష ఎంపీలపై చైర్మన్ వెంకయ్యనాయుడు క్రమశిక్షణా చర్యలు తీసుకుoటూ 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సభ్యులు నిబంధనలను పాటించాలని, సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని వెంకయ్యనాయుడు కోరారు. సభ్యులెవరైనా సంప్రదాయాలను పాటించాల్సిందేనని వెంకయ్యనాయుడు తెలిపారు.

నిన్న సభలో విపక్ష సభ్యుల ప్రవర్తనను గుర్తుచేస్తూ వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు భౌతిక దూరం, కోవిడ్-19 నిబంధనను విస్మరించారని ఆరోపించారు. రాజ్యసభకు నిన్న(ఆదివారం) ఓ చెడ్డరోజుగా మిగిలిపోతుందని చెప్పారు. బెంచ్‌లపై డ్యాన్సులు చేయడం, పేపర్లు చించేసి విసిరేయడం రాజ్యాంగ విరుద్ధమన్న వెంకయ్యనాయుడు.. పార్లమెంటరీ మర్యాద అంటే ఇదేనా నిలదీశారు. విపక్ష సభ్యులు కొందరు డిప్యూటీ చైర్మన్‌ను భౌతికంగా బెదిరించారని ఆయన ఆన్నారు.