చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేదంటే పవర్ నుంచి తప్పుకోండి

రైతులకు వ్యతిరేకంగా చేసిన కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సవరణ చేయడం కుదరకపోతే మోదీ ప్రభుత్వం వెంటనే పవర్ నుంచి దిగాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ… 2006 లో సింగూరు వేదికగా దాదాపు 26 రోజుల పాటు నిరశన చేసిన విషయాన్ని మమత ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగూరులో జరిగిన కార్యక్రమాన్ని తామెన్నడూ మరిచిపోమని తెలిపారు. తాము బంద్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని అయితే రైతుల డిమాండ్లకు మాత్రం పూర్తి మద్దతు ఉంటుందని ఆమె ప్రకటించారు. రైతుల హక్కులను త్యాగం చేసిన గవర్నమెంట్‌కు అధికారంలో ఉండే హక్కు లేదు’ అని మమత పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీ విస్తరించడానికి తాము అవకాశం ఇవ్వబోమన్నారు. అవతలి పార్టీ వచ్చి తమ రాష్ట్రాన్ని నియంత్రిస్తామంటే ఊరుకోబోమని వివరించారు. బెంగాల్ పై బీజేపీ పట్టు సాధించకుండా పోరాటం చేస్తూనే ఉంటానని, ప్రజలు కూడా బీజేపీని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.