రక్షణశాఖ అమ్ములపొదిలో తేజస్ ఫైటర్ జెట్స్‌..

భారతీయ వాయుసేన అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు చేరనున్నాయి. పొరుగు దేశాలతో పొంచియున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుని వాయుసేనకు తక్షణ అవసరం కింద తేజస్ యుద్ధవిమానాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో రక్షణశాఖ బుధవారం ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.48వేల కోట్లతో తేలికపాటి 83 తేజస్ యుద్ధ విమానాలను కోనుగోలు చేయనున్నారు.

ప్రధాని మోడీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వీటిని తయారు చేస్తున్నారు. ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా రక్షణశాఖ పెట్టిన ప్రపొసల్‌కు కేంద్రం ఒకే చెప్పింది.అనంతరం పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్‌కు ముందే దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ఈ డీల్‌పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఇక మీదట రక్షణరంగ అవసరాల కోసం ఇండియా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో డిఫెన్స్ ఉత్పత్తులు, యుద్ధ సామగ్రిని దేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.కాగా, అటు డ్రాగన్ కంట్రీ, ఇటు దాయాది పాక్ నుంచి కవ్వింపు చర్యలను నిషితంగా గమనిస్తున్న కేంద్రం ఇప్పటికే అత్యాధునిక రాఫెల్ యుద్ధవిమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.50వేల కోట్ల విలువనైన ఒప్పందంలో భాగంగా 36 ఫైటర్ జెట్స్‌ ఇండియాకు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 8 రాఫెల్ జెట్స్‌ను ఫ్రాన్స్ డెలివరీ చేసింది. తాజాగా 83 తేజస్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంతో భారతీయ వాయుసేన సామర్థం మరింత పెరుగుతుందని.. రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.