సీబీఐ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి కేసు.. దాదాపు రూ. 100 కోట్ల వరకు..

భారతీయ రైల్వే ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి మహేందర్ సింగ్ చౌహాన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. కోటి రూపాయల లంచం కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు సీబీఐ తెలిపింది. తాము ఇటీవలి కాలంలో చూసిన అతి పెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసు ఇదేనని సీబీఐ ఈ సందర్భంగా తెలిపింది. గత కొద్ది రోజుల వ్యవధిలో తాము పెద్ద మొత్తంలోనే నగదును స్వాధీనం చేసుకున్నామని, అయితే సీబీఐ చరిత్రలో మాత్రం ఇదే అతి పెద్ద ఎన్‌ట్రాప్ మెంట్ కేసు ఇదేనంటూ సీబీఐ పేర్కొంది. అసలు నిందితుడు మహేందర్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఒక సారి పరిశీలిస్తే.. మహేందర్ సింగ్ 1985 రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన వాడు. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ ఫ్రాన్షియర్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్‌గా ఉన్న మాలిగావ్‌లో ఆయన సేవలు అందిస్తున్నాడు. నార్త్ ఈస్ట్ ఫ్రాన్షియర్ రైల్వేలో ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులను ఇప్పిస్తానని ఆయన లంచం తీసుకున్నట్టు సీబీఐ చెబుతోంది. అంకెలను తారు మారు చేయడంతో పాటు ఇతర తప్పులు కూడా మహేందర్ సింగ్ చేసినట్టు సీబీఐ గుర్తించింది. బిల్లు మొత్తం రూ. 1.80 కోట్లు అయితే.. మహేందర్ సింగ్ ఆ నెంబర్ ముందు 1 చేర్చి రూ. 11.80 కోట్లుగా మార్చి అవినీతిని పాల్పడినట్టు చూసింది. మరో బిల్లు రూ. 2 కోట్లు కాగా.. ఆ బిల్లు ముందు కూడా ఒకటి చేర్చి దాన్ని రూ. 12 కోట్లుగా మార్చినట్టు సీబీఐ గుర్తించింది. ఇదే విధంగా మొత్తంగా 8 బిల్లుల ముందు 1 చేర్చడం ద్వారా మొత్తంగా దాదాపు రూ. 100 కోట్ల వరకు అవినీతి జరిగినట్టు సీబీఐ తెలుసుకుంది. కాగా.. ఈ కేసులో మహేందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ, ఉత్తరా ఖండ్, అసోంతో పాటు దేశంలోని మొత్తం 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులను నిర్వహించినట్టు తెలుస్తోంది.