పెగాస‌స్ పై కేంద్రం కొత్త వాద‌న‌

దేశంలో కీల‌క‌మైన రాజ‌కీయ నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు, మేధావుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నార‌ని… ఇందుకు కేంద్రం పెగాస‌స్ అనే ఇజ్రాయిల్ సాఫ్ట్ వేర్ వాడుతుంద‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. పెగాస‌స్ ఇష్యూపై కేంద్రం అఫిడ‌విట్ ఫైల్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇప్ప‌టికే కేంద్రానికి రెండుసార్లు స‌మ‌యం ఇచ్చింది.

తాజాగా అఫిడ‌విట్ పై సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాద‌న‌లు వినిపిస్తూ… ఈ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలియాల్సిన ప‌నిలేద‌న్నారు. పిటిష‌న్ల అభ్యంత‌రాల‌ను నిగ్గు తేల్చ‌డానికి నిపుణుల‌తో కూడిన‌ స్వతంత్ర్య ద‌ర్యాప్తు సంస్థ‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని, నిజంగానే పెగాస‌స్ తో ఫోన్ ట్యాప్ అయ్యిందా లేదా తెలిసిపోతుంద‌న్నారు. ఈ క‌మిటీ త‌న రిపోర్టును సుప్రీంకోర్టుకే ఇచ్చేలా ఆదేశించ‌వ‌చ్చ‌ని, అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని తేలితే అప్పుడు చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని ఆయన వాదించారు.

అయితే, ఇప్ప‌టికే కేంద్రానికి తాము స‌రిప‌డా స‌మ‌యం ఇచ్చామ‌ని… కేంద్రం త‌న వైఖ‌రి మార్చుకోకుంటే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆద్వ‌ర్యంలోని బెంచ్ ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది.