పేదల పక్షపాతి అని తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు విమర్శించారు. పేద ప్రజలకు వినోదం తక్కువ ధరకు అందజేసే ఉద్దేశంలో ఇలాంటి తిరకాసు ఉందన్నారు. భారతి సిమెంట్, సాక్షి పేపర్లు తక్కువ ధరకు ఎందుకు ఇవ్వరు పేదలకు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి సొంత ఫ్యాక్టరీలు, ఆస్తులు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నానాటికి దిగజారి పోతుంది. కనీసం ఉద్యోగస్తులకు నెల పూర్తయిన తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అని నిలదీశారు. నెల రోజులు కష్టపడ్డ ఉద్యోగస్తులకు నెల ఆఖరున జీతం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక ట్రాక్టర్ ఇసుక ధర 10 నుండి 14 వేల వరకు పెంచారు. 50 శాతం వరకు ఆర్టీసీ చార్జీలు పండుగ సీజన్లో పెంచారు.. ఇదేనా పేద ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ అన్నారు. ఇలాంటివి చెబుతూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ముఖ్యమంత్రి పరోక్ష యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది అన్నారు.