రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనడం వైసీపీ చేతకానితనానికి నిదర్శనం

  • జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ పేర్కొనడం సిగ్గుచేటని, అది రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్యోగులు జీతాల విషయంలో సంయమనం పాటించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజన్న ప్రసాద్ ఇచ్చిన ప్రకటనపై శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మలిశెట్టి వెంకటరమణ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 1.15 వేల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రాన్ని అమ్మివేశారని గొంతు చించుకున్న వైసీపీ నేడు 10 లక్షల కోట్లు రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి వైసిపి ప్రభుత్వం దిగజారిపోయిందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క మాసం కూడా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు.