హరిహర పుత్రుడు మణికంఠుడు చూపిన మహిమ

పూర్వకాలంలో రాజ్యాలను ఆక్రమించుకోవడం కోసం, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎన్నోకుట్రలు.. కుతంత్రాలు జరుగుతూ ఉండేవి. హరిహరుల పుత్రుడుగా జన్మించిన మణికంఠుడిని కూడా ఈ కుతంత్రాలు వెంటాడాయి. మణికంఠుడిని దైవమిచ్చిన బిడ్డగా భావించిన రాజశేఖరుడు, తన తరువాత సింహాసనాన్ని అతనికి అప్పగించాలని అనుకుంటాడు.

మణికంఠుడిపై ఆయనకి గల ప్రేమాభిమానాలు.. అతను రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలు జరుగుతోన్న శుభపరిణామాలు ఇందుకు కారణమవుతాయి. ఒకానొక సంతోష సమయంలో తన మనసులోని మాటను అయన మహామంత్రి దగ్గర ప్రస్తావిస్తాడు. ఆ మాట వినగానే మంత్రి తీవ్రమైన అసహనానికి గురికావడాన్ని రాజశేఖరుడు గమనించలేకపోతాడు.

అలాంటి పరిస్థితి రానీయకుండా చూడమని ముందుగానే మహారాణి చెప్పిన మాట మంత్రికి గుర్తుకువస్తుంది. దాంతో ఆయన మణికంఠుడిని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక రాత్రివేళ తన అనుచరులను మణికంఠుడి మందిరానికి పంపిస్తాడు. మణికంఠుడు సాక్షాత్తు హరిహరుల పుత్రుడని తెలియని వాళ్లు, నిద్రిస్తోన్న అతనిపై కత్తులతో దాడిచేసేందుకు మందిరంలోకి ప్రవేశిస్తారు.

మణికంఠుడి పాన్పుపై అతని స్థానంలో ఒక భయంకరమైన విషసర్పం ఉండటం చూసి భయంతో వాళ్లు కంపించిపోతారు. అది బుసలుకొడుతూ పైకి లేవడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగందుకుంటారు. మహారాణి మద్దతుతో మహామంత్రి వేసిన పథకం, మణికంఠుడు చూపిన మహిమతో విఫలమవుతుంది.