నాగార్జున యూనివర్సిటీ వీ.సీని తక్షణమే సస్పెండ్ చేయాలి: ఆళ్ళహరి

కాకినాడ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మలాంటి ఉన్మాదిని అతిధిగా పిలవటమే కాకుండా అతను విద్యార్థులకు ఇచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని సైతం సమర్ధించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. తినండి, తాగండి, ఏంజాయ్ చేయండి అంటూ విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైనా విద్యాసంస్థ అకడమిక్ ప్రదర్శనకు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే వారినో, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారినో ఆహ్వానిస్తారు కానీ రాంగోపాల్ వర్మ లాంటి సైకోలను పిలవటం యూనివర్సిటీకే మాయనిమచ్చగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా బ్రతకమని, ఉపాధ్యాయులు చెప్పేది వినాల్సిన అవసరం లేదని, కష్టపడి చదివిన వారు పైకిరారు అంటూ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమన్నారు. స్త్రీ అంటే ఏమాత్రం గౌరవం లేని, మహిళని ఒక ఆటబొమ్మలా చూసే రాంగోపాల్ వర్మలాంటి వ్యక్తిని తీసుకొచ్చి విద్యార్థులకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలిచారో నిర్వాహకులు చెప్పాలన్నారు. ప్రపంచంలో మగవాళ్ళందరూ చనిపోయి తాను మాత్రమే బ్రతకాలని అప్పుడు ఆడవాళ్ళందరికీ నేనే దిక్కు అవుతాను అంటూ మాట్లాడిన మానసిక రోగి రాంగోపాల్ వర్మకు పిచ్చికుక్కకు పెద్ద తేడాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మనసులు విషపూరితంగా మారేలా ప్రసంగించిన రాంగోపాల్ వర్మను ఖండించాల్సిన యూనివర్సిటీ వీ సీ రాజశేఖర్ అతనికి పీ హెచ్ డీ, డాక్టరేట్ ఇవ్వాలని అందుకు అతను అర్హుడు అంటూ వ్యాఖ్యానించటం ప్రొఫెసర్లను విద్యార్థులను, మేధావులను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ సభ్యతా సంస్కారాలు మరచి చేసిన వ్యాఖ్యలను అక్కడున్న మేధావివర్గం ఖండించక పోవటం అత్యంత శోచనీయమన్నారు. ఎంతో ఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఇలాంటి సంఘటనలకు పూర్తి బాద్యత వహించి వీ.సీ రాజశేఖర్ రాజీనామా చేయాలని అల్లహరి అన్నారు. లేనిపక్షంలో మొత్తం సంఘటనపై గవర్నర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆళ్ళ హరి వ్యాఖ్యానించారు.