రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు యువతులకు రక్షణ లేదని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు డిఆర్డిఏ మాజీ రాష్ట్ర అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు లోని మారుమూల గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్న 18 సంవత్సరాల ఆడబిడ్డ అదృశ్యమవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదని, విజయనగరం జిల్లా లోతు గడ్డలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలసివేసిందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం పట్ల మాట్లాడగానే ఆహాకారాలు చేసిన పాలకపక్షం, మహిళా కమిషన్ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు జరిగిన దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఈ రెండు దురాగతాల పట్ల రక్షణ శాఖ మంత్రి గానీ, మహిళా కమిషన్ గానీ నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు సాగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు, మహిళలకు రక్షణ కరువైందని, గొప్పలు చెప్పుకునే దిశా చట్టం కూడా అభాసుపాలవుతోందని ఆరోపించారు. కఠినంగా వ్యవహరించే పోలీసులను కూడా పాలక పక్షం చేతులు కట్టేస్తోందని అన్నారు. మహిళల రక్షణ పట్ల పాలక పక్షానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జరిగిన రెండు ఘటనలపై విచారణ చేపట్టి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.