రాబోయే తరాలు స్మరించుకోవాలని.. ఎయిర్‌పోర్ట్‌కు తన పేరు పెట్టుకుంటున్న ట్రంప్

రాజకీయ నాయకులు తమ జీవితాంతం ఎన్నో పదవులును అనుభవించినా తమను ముందు తరాలు కీర్తించుకోవాలని, ఎప్పుడూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో వుంటారు. ఒకవేళ వారికి ఆ ఆలోచన లేకపోయినా సదరు వ్యక్తి పార్టీకి చెందిన తర్వాతి నేతలు విమానాశ్రయాలు, విద్యాసంస్థలు, సాంకేతిక సంస్థలు లేక మరేదైనా కార్యాలయానికి ఆయన పేరును పెడతాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తనను రాబోయే తరాలు కీర్తించుకోవాలని, అనుక్షణం స్మరించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఎవరో తన పేరును ఏదైనా సంస్థకు పెట్టే బదులు, తానే పెట్టుకుంటే సరిపోతుందనే ట్రంప్‌కు ఓ ఆలోచన వచ్చేసింది. దీనిలో భాగంగా దేశంలోని ఓ విమానాశ్రయానికి తన పేరు పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. తన నిర్ణయానికి సంబందించి సన్నిహితులు, సలహాదారులతో కూడా ట్రంప్ చర్చిస్తున్నారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు తన పేరును పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకు మరో కారణం కూడా వుంది. వైట్ హౌస్ వీడిన తర్వాత ట్రంప్ దంపతులు మార్ -ఏ- లాగోలోని తమ నివాసానికి వెళతారు. ఈ ప్రాంతానికి పామ్ బీచ్ ఎయిర్‌పోర్టే దగ్గర ఉండటంతో ట్రంప్ దీనిని ఎంచుకున్నారు.