నేడు ఎన్డీయే కూటమి సమావేశం

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్​ను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు ఉమ్మడిగా పోటీచేశాయి. కూటమిలోని అన్ని పార్టీలు కలిపి 125 స్థానాలు సాధించాయి. ఇందులో అత్యధికంగా 74 సీట్లలో విజయం సాధించిన బీజేపీ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిగిలిన పార్టీలైన జేడీయూ 43 స్థానాల్లో, వీఐపీ 4, హెచ్ఏఎం 4 సీట్ల చొప్పున గెలుపొందాయి. దీంతో తమకంటే తక్కువ స్థానాల్లో గెలుపొందినప్పటికీ బీజేపీ నితీశ్ కుమార్‌కే మారోమారు సీఎంగా అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో ఈరోజు సమావేశమవనున్న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు నితీశ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం లాంఛనమే కానుంది.