నేడు సూపర్‌స్టార్ పుట్టినరోజు.. అభిమానులలో కొత్త ఉత్సాహం

ఒక సాధారణ కండక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ రోజు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తాజాగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీకి సంబంధించిన విధివిధానాలు డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆయన తెలిపారు. త్వరలోనే రజనీ రాజకీయంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాంతో రజినీ పుట్టినరోజు ఆయన అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రజినీ అభిమానులు ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసం ముందు బ్యానర్లు, రజినీ ఫోటోలు పట్టుకొని నినాదాలు చేశారు. రజినీ మక్కల్ మండ్రంకు చెందిన నాయకులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950లో బెంగుళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. రజినీకాంత్ 1975లో తమిళంలో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.