నేడు ప్రపంచ సింహాల దినోత్సవం.. ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ..

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘సింహం గొప్పది అంతేకాక ధైర్యానికి నిర్వచనం. సింహాలకు నిలయంగా ఉన్నందుకు భారత్ గర్వపడుతోంది. ప్రపంచ సింహ దినోత్సవం రోజు సింహల పరిరక్షణపై మక్కువ ఉన్న ప్రజలందరినీ అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల సంఖ్య పెరుగుతుంది. ఈ సందర్భంగా మోడీ మరిన్ని విషయాలను ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్ సింహాలకు సురక్షితమైన ఆవాసాలు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. సింహాల సంఖ్య పెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దీనివల్ల పర్యాటకానికి కూడా ప్రోత్సహం అందిందని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున సింహాలపై అవగాహన పెంచడం, వాటి సంఖ్యను లెక్కించడం, వాటి పరిరక్షణకు మద్దతును సేకరించడంపై వంటి వాటిపై దృష్టి సారిస్తారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు. ఆసియాటిక్ సింహం భారతదేశంలో కనిపించే ఐదు పెద్ద జంతువులలో ఒకటి. మిగిలిన నాలుగు రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుత, క్లౌడ్ చిరుత, మంచు చిరుత.

గతేడాది జూన్‌లో గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన గంభీరమైన పెద్ద జంతువుల జనాభా లెక్కల ప్రకారం.. సింహాల సంఖ్య పెరిగింది. భారతదేశం 2015 లో 523 నుంచి 2020 లో 674 వరకు అంటే 29 శాతం సింహాల సంఖ్య పెరిగిందని ప్రకటించాయి. అటవీ జంతువులు అంతరించిపోవడం వల్ల మానవజాతికి పెను ముప్పు వాటిల్లుతుంది. అందుకే వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. వనాలను పెంచాలి ప్రకృతిని, అటవీ జంతువులను కాపాడాలి.