నేడు రైతుల ‘చక్కా జామ్‌’.. ఢిల్లీలో భారీ భద్రత

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కా జామ్‌ పేరుతో మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎర్రకోట తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వెల్లడించింది.

ఇందులో భాగంగా రైతులు ఆందోళనలు చేస్తున్న మూడు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప తీగలు పెట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మింటో బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. ఎర్రకోట వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా ఘాజీపూర్‌ సరిహద్దు మొత్తం పోలీసులతో నిండిపోయింది. భారీగా బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటుచేయడంతోపాటు వాటర్‌ క్యానన్లు, వజ్రా వాహనాలను మోహరించారు.