బైడెన్‌ పాలనాతీరుపై విరుచుకుపడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనాతీరుపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఆదివారం నార్త్‌ కరోలినా రిపబ్లికన్‌ కన్వెన్షన్‌లో రిపబ్లిక్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనాకు నమస్కరిస్తున్న బైడెన్‌ పరిపాలన విధానం దేశ చరిత్రలోనే అత్యంత చెత్త పరిపాలన అని అన్నారు. అమెరికా ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండాలని, రెండో స్థానంలో కాదని అన్నారు. మన కళ్ల ముందే దేశం విచ్ఛిన్నమవుతోందంటూ మండి పడ్డారు. క్రైమ్‌ పెరిగిపోతోందని, భద్రతా వ్యవస్థ నిర్వీర్య దిశగా కొనసాగుతోందని దుయ్యబట్టారు. మంచి రాజకీయం అంటే ఇదేనా అని బైడెన్‌ను ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా చట్టవిరుద్ధంగా వలసలు పెరిగాయని, అవి కూడా కొన్ని నెలల వ్యవధిలోనే జరిగాయని అన్నారు. ఇంధనం ధరలు మండుతున్నాయని, మన పరిశ్రమలపై విదేశీయుల సైబర్‌ దాడులు పెరిగిపోయాయని, మన నేతలు చైనాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వేదికపై అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికాను మోకరిల్లేలా చేస్తున్నారని అన్నారు. బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుసరిస్తున్న పరిపాలన విధానంతో స్వేచ్ఛ హరించి వేస్తున్నారని.. ఇది దేశానికి విషంగా పరిణమించనుందని ట్రంప్‌ మండిపడ్డారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అనంతరం ట్రంప్‌ తొలిసారి పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గనడం గమనార్హం.