ట్రంప్ వాడిన కరోనా ఔషధం హర్యానాలో తొలిసారి వినియోగం.. కోలుకున్న వృద్ధుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కరోనా బారినపడినప్పుడు వేసుకున్న మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును మన దేశంలో తొలిసారి వినియోగించారు. హర్యానాలో ఓ రోగికి ప్రయోగాత్మకంగా ఇవ్వగా అతడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మొహబత్‌సింగ్ (84)కి యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును ఇచ్చామని, ఆయన పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు మేదాంత  ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నరేశ్ తెహ్రాన్ తెలిపారు.

ఈ ఔషధం ఆసుపత్రికి వెళ్లే అవసరాన్ని 70 శాతం తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. యాంటీబాడీస్ కాక్‌టెయిల్ ఔషధాన్ని అమెరికాకు చెందిన రోచె సంస్థ అభివృద్ధి చేసింది. దీని ఒక్కోడోసు ధర రూ. 59,750. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమే ఇది. ఒక్కో ప్యాక్‌లో రెండు డోసులు ఉంటాయి. ఒక్కో డోసులో 1200 ఎంజీ మందు ఉంటుంది. అన్ని పన్నులతో కలుపుకుంటే ఈ ఔషధం ధర రూ. 1,19,500 వరకు ఉంటుంది. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను భారత్‌లో విడుదల చేశారు. ప్రముఖ ఆసుపత్రులు, కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.