కరోనా టీకా రెండో డోస్‌ తీసుకున్న కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్నారు. సతీమణి నూతన్‌ గోయల్‌తో కలిసి ఢిల్లీలోని హార్ట్‌ అండ్‌ లంగ్‌ ఇనిస్టిట్యూట్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు. ఇంతకు ముందు ఈ నెల 2న వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. మళ్లీ 28 తర్వాత ఆయన మంగళవారం రెండో డోసు తీసుకున్నారు. కొవాగ్జిన్‌ టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత తమకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగలేదన్నారు.

రెండు భారతీయ టీకాలు సురక్షితం, ప్రభావంతమైనవని స్పష్టంచేశారు. టీకాలపై ఇప్పటికీ చాలా మందిలో సందేహాలు ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని కోరారు. టీకాలు తీసుకున్న వారిలో కొందరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ అరుదైన సందర్భాలు మాత్రమేనని.. టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకే, ఆసుపత్రుల్లో చేర్పించే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నుంచి ఇప్పటి వరకు దేశంలో 6,11,13,354 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.