లోక్ సభలో విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అయితే లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్షాలు ఆందోళనలకు తెరలేపాయి. ప్రధాని నూతన మంత్రులను పరిచయం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలతో అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.  ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నూతన మంత్రి వర్గ సభ్యులను పరిచయం చేసే సమయంలో ఈ విధంగా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు.

ఆ తర్వాత కూడా విపక్ష సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాయిదా తీర్మానాలకు అవకాశం ఇవ్వాలంటూ ఎలుగెత్తారు. దాంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అంతకుముందు, ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… సభలో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. క్యాబినెట్ లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామం అని పేర్కొన్నారు.