‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పవన్ మార్కు హీరోయిజం గ్యారంటీ!

పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. మూడు సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీద చూద్దామని ఎదురుచూస్తున్న అభిమానులకి ఆ అవకాశం మరెంతో దూరంలో లేదని చెబుతూ, అంతకు ముందుగానే ట్రైలర్ రూపంలో ఆ ఆకలిని కొద్దిగా తీరుస్తూ వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ఆద్యంతం పవన్ కళ్యాణ్ అభిమానులకి కన్నుల విందుగా ఉంది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌లో అదరగొట్టిన పవన్‌ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా కనిపించారు. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోని థియేటర్‌లలో వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల కోలాహలం నెలకొంది.

పవన్ కల్యాణ్ తనదైన శైలిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. కోర్టు, వాదనల నేపథ్యంలో వచ్చే సీన్లలో మరింత శక్తిమంతంగా కనిపించారు. అభిమానులకి జోష్ ఇచ్చేలా ఉంది. చివర్లో పవన్ అడిగిన ప్రశ్న, ఇచ్చిన పంచ్ హైలైట్ గా నిలుస్తుంది. ముగ్గురు అమ్మాయిల పాత్రలు సినిమాకే హైలైట్ అని అర్థం అవుతుంది. ఇప్పటికే మ్యూజిక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. నేపథ్య సంగీతం హైలైట్ గా నిలవనుందని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్లలో సంగీతం అభిమానులకి ఉత్సాహన్నిచ్చేలా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.