క్లైమాక్స్ కు చేరుకున్న వరుణ్ తేజ్ ‘గని’

వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘ఎఫ్ 3’ అయితే, మరొకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’. కరోనా కారణంగా మధ్య మధ్యలో అవాంతరాలు ఎదురవుతున్నా, ఈ రెండు ప్రాజెక్టులలో ఆయన పాలుపంచుకుంటూనే వస్తున్నాడు. అయితే ముందుగా ఆయన ‘గని’ సినిమాను పూర్తిచేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.

అల్లు బాబీ .. సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి ఆమె పరిచయమవుతోంది. ఇక కీలకమైన పాత్రలలో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ ఉన్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.