వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశిష్టత..

శివారాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాల్నీ కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో ప్రముఖ శివాలయాల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఒకటి. ఈ దేవాలయం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. వేములవాడను మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం.

ఆలయ చరిత్ర:

మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

ఆలయ ప్రత్యేకత:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా జాతరకు 7లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారని అంచనా.

ఇక శివరాత్రి మహోత్సవ వేడుకలకు ఏటా 4లక్షల మంది భక్తులు వస్తారు. తెలంగాణ రాష్టం నుండే కాకుండా పక్కరాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని పునీతులు అవుతారు. రేపటి నుండి 3రోజుల పాటు జరిగే వేడుకలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తుల అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత రెండేళ్ల నుంచి హెలికాప్టర్ సదుపాయాలను కూడా పర్యాటకశాఖ అందుబాటులోకి తెచ్చింది.