త్రి-భాషా ఫార్ములా మాకొద్దు తమిళనాడు సీఎం!

విద్యా వ్యవస్థలో కీలక మార్పులతో కేంద్రం ఆమోదించిన నూతన విద్యా విధానం త్రి-భాషా సూత్రాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనిని పునః పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీని పళనిసామి సోమవారం కోరారు. ఇటీవల వెల్లడించిన నూతన విద్యా విధానంలో త్రి-భాషా పాలసీని పేర్కొన్నారని, దీనిని తమిళనాడులో అనుసరించబోమని స్పష్టం చేశారు. గత ఎనిమిది దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలు ద్వి-భాషా సూత్రం ప్రతిపాదికనే విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రస్తుతం కూడా దానినే కొనసాగిస్తమని ఉద్ఘాటించారు.

‘రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఏఐఏడీఎంకే సహా మెజారిటీ రాజకీయ పార్టీలు ద్విభాషా విధానాన్ని సమర్ధిస్తున్నాయి. ఈ సమయంలో, కేంద్రం కొత్త విద్యా విధానంలో త్రి-భాషా ఫార్ములా తీవ్ర ఆవేదనకు కారణమవుతుంది’ అని పళనిసామి అన్నారు. కాబట్టి, తమిళుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.