అభిషేక్‌పై గెలిచి నాపై పోటీకి రా..! అమిత్‌షాకు మమత సవాల్‌

తాను… తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విషయంలో హోంమంత్రి అమిత్ షా వేసిన సెటైర్ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. (దీదీ-భాయ్ పో అంటూ బెంగాలీలో అమిత్ షా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్న విషయం గమనార్హం). మీరు మొదట నా మేనల్లుడిపై పోటీ చేయాలనీ, ఆ తరువాతే తనపై అని మమత సవాల్ విసిరారు. పగలు, రాత్రీ మీరు దీదీ-భతిజా గురించి మాట్లాడుతున్నారని, మొదట అభిషేక్ బెనర్జీపై పోటీ చేసి గెలవాలని ఆమె అన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లా పైలాన్ లో గురువారం జరిగిన ర్యాలీలో ఆమె..తన మేనల్లుడిని సమర్థించారు. అతడు రాజ్యసభను ఎంచుకుని ఎంపీ అయ్యేవాడని, కానీ ప్రజాతీర్పు కోసం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడని ఆమెఅన్నారు.

మీ కుమారుడు 2019 లో బీసీసీఐ కార్యదర్శిగా ఉండి కోట్లాది రూపాయలు సంపాదించలేదా అని ఆమె అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. అతడ్ని రాజకీయాల్లోకి తీసుకోచ్ఛే దమ్ము మీకుందా అని కూడా దీదీ సవాల్ విసిరారు. అటు బెంగాల్ లో బీజేపీ పరివర్తన్ యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రల్లో అమిత్ షా తో బాటు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు అయిదు యాత్రలు పూర్తయ్యాయి.